‘కృష్ణా’పై మరో ఎత్తిపోతలు

 కృష్ణా నదీ జలాలను వినియోగిస్తూ మరో కొత్త ఎత్తిపోతల చేపట్టే ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటివరకు సాగునీటి వసతి లేని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నీరిచ్చేలా డిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు అందజేసింది. పాలమూరు–రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌ నుంచి   
నీటిని తీసుకుంటూ 75 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా తీసుకుంటున్న కృష్ణా జలాలను డిండికి సైతం 30 టీఎంసీల మేర తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏదుల రిజర్వాయర్‌ ద్వారా డిండికి తరలించేలా ఇటీవలే తుది ప్రతిపాదన సిద్ధమైంది. ఇదే ఏదుల నుంచి నల్లమల ప్రాంతంలో నీరందని ప్రాంతాలకు నీరిచ్చేలా అమ్రాబాద్‌ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఏదుల నుంచి గ్రావిటీ పైప్‌లైన్‌ ద్వారా తరలించి అక్కడినుంచి జిలుగుపల్లి పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసే 20.5 మెగావాట్ల సామర్థ్యం గల 2 పంపుల ద్వారా ప్రతిరోజు 0.1 టీఎంసీ నీటిని తరలించాలని ప్రతిపాదించారు. 60 రోజుల పాటు నీటిని తరలించడమంటే 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు.