న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఐటీ ప్రొఫెషనల్ చారు మాథూర్‌పై పని భారం రెట్టింపయ్యింది. ఇంటి నుంచి పని చేయడంతోపాటు అదనంగా ఇంటి పని భారం మీద పడింది. రెండు విధులను నిర్వర్తిస్తూ 14 నెలల బాలుడి ఆలనా పాలన చూసుకోలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటి వరకు చారు మాథూర్ ఆఫీసు పని మాత్రమే చూసుకుంటుంటే పని మనిషి ఇంటి పనులు చూసుకునేది. అయితే పని మనిషి నివసిస్తోన్న బస్తీలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో మాథూర్ ఉంటున్న అపార్ట్‌మెంట్ రెసిడెన్షియల్ సొసైటీ పని మనుషుల మీద నిషేధం విధించింది.
‘నో, నేను ఈ రూల్‌ను ఒప్పుకోను. మా పని మనిషి నేను తెచ్చుకుంటా!’ అంటూ ఢిల్లీకి పొరుగునున్న గురుగ్రామ్‌కు చెందిన 32 ఏళ్ల చారు మాథూర్ ఇటీవల అపార్ట్‌మెంట్ రెసిడెన్షియల్ వాట్సాప్ గ్రూపులో ఓ పోస్టింగ్ పెట్టింది. ఆమెకు మద్దతుగా 40 మంది అపార్ట్‌మెంట్ మహిళలు వచ్చి సొసైటీ రూల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఇంటి పని విషయంలో నేడు కూడా లింగ వివక్షత ఎక్కువగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంటి నుంచే ఆఫీసులకు పని చేస్తున్నప్పటికీ ఇంటి పనిభారం ఎక్కువగా భార్యలమీదే ఉంటోంది’ అని అశోకా యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న అశ్వణీ దేశ్‌పాండే వాపోయారు. ‘అలా అని పూర్తి స్థాయి గృహిణిల పరిస్థితి బాగుందని నేను చెప్పడం లేదు. వారయితే భర్తలతోపాటు అత్తమామలు, ఆడ బిడ్డలు, ఇంట్లో ఉండే అందరి పనులను చూసుకోవాల్సి వస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.